తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌పై రేపు నిర్ణయం…

0
47

హైదరాబాద్:
తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌పై ఆదివారం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రగతిభవన్‌లో రేపు ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో రెండు నెలలుగా నిలిచిపోయిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి సీఎస్‌ సోమేష్‌కుమార్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అధికారులు హాజరు కానున్నారు.

కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేశారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అప్పగించారు. తాజాగా ఎల్‌ఆర్‌ఎస్ (ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌)ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇళ్ల స్థలాలు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద నమోదు చేసుకుంటేనే అవి మనుగడలో ఉంటాయని, లేదంటే వాటి విలువ శూన్యమని, వాటి క్రయవిక్రయాలు ఉండవని, రుణాలు సైతం రావని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ పూర్తికాని భూముల రిజిస్ట్రేషన్‌కాని పక్షంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పెద్దగా పని ఉండదు. ప్రస్తుతం వివాహ రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here