జయశంకర్ భూపాలపల్లిజిల్లా అక్టోబర్ 29 (గురువారం).
ఒక రోజు వర్క్ షాపులో పాల్గొన్న తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఉన్నతాధికారులు
అడవుల రక్షణ, కలప స్మగ్లింగ్ నివారణ, పులులు, వన్యప్రాణుల ఆవాసాల వృద్దిపై రాష్ట్రాల మధ్య సమన్యయం
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అడవులు, వన్యప్రాణుల రక్షణ, కలప స్మగ్లింగ్ నివారణ ధ్యేయంగా కలిసి పనిచేయాలని మూడు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ జెన్ కో కార్యాలయ గెస్ట్ హౌస్ లో మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల పాలన, పోలీస్, అటవీ అధికారుల ఒక రోజు వర్క్ షాప్ జరిగింది.
సుమారు రెండు దశాబ్దాల విరామం తర్వాత ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పెద్ద పులి సంచారం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్త మైంది. గోదావరి వెంట మూడు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న అడవులను కాపాడటం, కలప స్మగ్లింగ్ నివారణ, వన్యప్రాణుల రక్షణ, వృధ్దికి పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. తడోబా (మహారాష్ట్ర), ఇంద్రావతి (ఛత్తీస్ ఘడ్), కవ్వాల్ (తెలంగాణ) పులుల సంరక్షణ కేంద్రాల్లో ఇప్పటికే తీసుకుంటున్న చర్యలు, ఆయా అడవుల్లో పులుల సంఖ్య పెరగటం వల్ల ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో అక్కడ తీసుకోవాల్సిన చర్యలు, సమన్వయంపై ప్రధానంగా చర్చ జరిగింది.
సరిహద్దు ప్రాంతాల్లో రెండు వైపులా కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు ద్వారా భద్రతను పటిష్టం చేయాలని నిర్ణయించారు. అలాగే జాయింట్ పెట్రోలింగ్ ద్వారా నిఘాను పెంచటం, పోలీస్ శాఖతో సమన్యయం, మూడు రాష్ట్రాల క్షేత్ర స్థాయి అధికారులతో సహా, ఉన్నతాధికారులు కూడా తరుచుగా సమావేశం కానున్నారు. ఉమ్మడి అధికారులతో వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేయటం ద్వారా సమాచార మార్పిడి చేసుకోనున్నారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాల్లో బేస్ క్యాంపుల ఏర్పాటు ద్వారా కలప అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టడంతో పాటు, అడవుల్లోకి స్మగ్లర్ల ప్రవేశాన్ని నియంత్రించనున్నారు.
ఈ సందర్భంగా పీసీసీఎఫ్ ఆర్. శోభ మాట్లాడుతూ అటవీ సమగ్రతను కాపాడి భవిష్యత్ తరాలకు సమతుల్య వాతావరణమును అందించాల్సిన బాధ్యత అటవీశాఖ పై ఉన్నదని, సరిహద్దు రాష్ట్రాల సమన్వయ సమావేశాల ద్వారా అటవీ ఆవాసాలను రక్షించటం, ప్రణాళికాబద్ధంగా అటవీ అధికారులకు అవగాహన పెంచటంతో నిరంతర నిఘా సాధ్యమౌతుందన్నారు. అదే విధంగా అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం కాబట్టి అటవీశాఖ అధికారులు అడవులు మరియు వన్యప్రాణుల ప్రాముఖ్యతను తెలియజేసే అటవీ సంరక్షణలో ప్రజలను భాగస్వాములను చేయాలని అన్నారు.
జాతీయ పులుల సంరక్షణ సంస్థ (NTCA) తరపున పాల్గొన్నఎస్.ఎన్.మురళి మాట్లాడుతూ అడవుల సంరక్షణలో తెలంగాణ చొరవను అభినందించారు. పులుల సంరక్షణకు మరిన్ని నిధులను మంజూరు చేస్తామని ప్రకటించారు. తాజాగా ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి లలో పెద్దపులి సంచరిస్తున్నందున అడవి అభివృద్ధికి అవకాశం ఉందన్నారు.
మహారాష్ట్ర – గడ్చిరోలి, చంద్రాపూర్ చీఫ్ కన్జర్వేటర్ ఎన్.ఆర్. ప్రవీణ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం జగదల్ పూర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ మహమ్మద్ షాహిద్ లు కూడా తమ ప్రాంతాల్లో అటవీ అభివృద్దికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. అడవిని రక్షించేందుకు, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణకు పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని రామగుండం కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.
జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెరిగి వన్యప్రాణులకు ఆవాసాలుగా మారుతున్నాయని దానిలో భాగంగానే జిల్లాకు పెద్దపులి వచ్చిందని భావిస్తున్నామని పులులకు ఆవాసంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారేందుకు అవకాశాలున్నందున జిల్లా అధికార యంత్రాంగం తరఫున పులుల ఆవాసాలను ఏర్పాటు చేసేందుకు అటవీశాఖకు అవసరమైన పూర్తి సహకారంను జిల్లా అధికార యంత్రాంగం తరఫున అందిస్తామని తెలిపారు.
వరంగల్ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్చర్ వర్క్ షాపుకు అధ్యక్ష వహిస్తూ, సమన్వయం చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, DFO పురుషోత్తం, మూడు రాష్ట్రాలకు చెందిన గోదావరి పరీవాహక ప్రాంతం జిల్లాల పాలన, పోలీస్, అటవీ అధికారులు, తడోబా, ఇంద్రావతి, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రొజెక్టు డైరెక్టర్లు, 13 జిల్లాల అటవీ అధికారులు, ట్రైనింగ్ ఐఎఫ్ఎస్ అధికారులు తదితరులు వర్క్ షాపులో పాల్గొన్నారు.